Pawan Kalyan: నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానం కలిగిస్తోంది: పవన్ కల్యాణ్
- కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ ను పరిశీలించిన వైనం
- ఎన్నికల సమయంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని వెల్లడి
- కేసులు పెట్టినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని అసంతృప్తి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. ఇక్కడ్నించి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఎప్పటినుంచో పవన్ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆయన పోర్టుకు వచ్చి స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సయయంలోనే, జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్టుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం ఇవాళ్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ వెల్లడించారు. వేల టన్నుల బియ్యం పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా తయారైందని, ఇక్కడ్నించి యధేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకుని కేసులు పెట్టినా సరే... పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరా శాఖ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.