Nara Lokesh: గంజాయి అమ్మేవారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్!

Govt schemes will be cancelled to the families who sells ganja

  • నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
  • ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా మార్పు
  • గంజాయి, డ్రగ్స్ పైఉక్కుపోదం మోపాలన్న లోకేశ్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను 'ఈగిల్' గా (ELITE ANTI-NARCOTICS GROUP FOR LAW ENFORECEMENT - EAGLE) మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సమావేశంలో నారా లోకేశ్ మాట్లాడుతూ గంజాయి, సాగు కట్టడికి టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. గంజాయి సాగు ధ్వంసానికి డ్రోన్లను వినియోగించాలని ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారి ఫొటోలను ప్రత్యేక వెబ్ సైట్ లో, పోలీస్ స్టేషన్ లో పొందుపర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్ చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.

గంజాయి పండించకుండా అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయం కూడా కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ సమావేశంలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, 'ఈగిల్' ఐజీ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News