KTR: రాజ్యాంగ దినోత్సవం రోజున... సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR open letter to Revanth Reddy

  • రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పాలన చేయాలని కేటీఆర్ సూచన
  • లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిక
  • దొడ్డిదారిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని మండిపాటు
  • తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చారని విమర్శలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వదిలేయాలని ఆ లేఖలో సూచించారు. రాజ్యాంగస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య పాలన చేయాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ లేఖ ద్వారా మీ రాజ్యాంగ వ్యతిరేక పాలనను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘిస్తోందని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగా రాష్ట్రంలోని అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఒక్కసారైనా గౌరవించకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా దొడ్డిదారిన ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రాథమిక హక్కు అయిన ప్రసంగ స్వేచ్ఛను తొక్కిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా కేసులు పెడుతున్నారని, మీడియా ప్రతినిధులపై కూడా దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

11 నెలల కాంగ్రెస్ పాలనలో పోలీసుల వేధింపులు ఎన్నడూ లేనంతగా పెరిగాయని ఆ లేఖలో ఆరోపించారు. మీ పాలనలో తెలంగాణ ఒక పోలీస్ రాజ్యాంగా మారిపోయిందని ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తిగా పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. మీ నిర్ణయాలతో మీ సోదరులు క్విడ్ ప్రోకో విధానంలో లబ్ధి పొందుతున్నారని ఆ లేఖలో కేటీఆర్ రాసుకొచ్చారు.

హైడ్రా మరో రాజ్యాంగేతర శక్తి అని మండిపడ్డారు. మార్పు అనే నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రజలు ఆ మార్పు ఏమిటో గుర్తించారన్నారు. మీ రాజ్యాంగ వ్యతిరేక, అసమర్థ పాలనను అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున, రాజ్యాంగ పరిపాలనను పునరుద్ధరించాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రజలకిచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి గౌరవం చూపించేలా రాజ్యాంగ హక్కులను, స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు పరిపాలన అందించాలన్నారు. నియంతృత్వ విధానంతో రాజ్యాంగ వ్యతిరేక పాలన కొనసాగిస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News