udaipur palace: ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో మహారాజుకు పరాభవం.. ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత

situation tense outside udaipur palace after vishvaraj singh denied entry over royal family feud

  • ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు
  • నూతన మహారాజు విశ్వరాజ్‌ సింగ్‌ను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్న దాయాదులు
  • ఇరువర్గాల మధ్య రాళ్లదాడి..పలువురికి గాయాలు

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు ఘర్షణకు దారి తీసింది. కొత్త మహారాజుగా పట్టాభిషేకం చేసిన విశ్వరాజ్ సింగ్‌కు ప్యాలెస్‌ వద్ద పరాభవం జరిగింది. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి కొత్త మహారాజును అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని దాయాదులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఇరువర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. 
 
రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహారాజుగా ఉన్న మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. 

అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంతో ఉన్న అరవింద్ సింగ్ ..కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన చేశారు. అరవింద్ సింగ్ ఉదయ్‌పూర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్ ‌కు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఈ క్రమంలో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి అడుగుపెట్టనివ్వనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

ఈ క్రమంలో సోమవారం రాత్రి కొత్త మహారాజు విశ్వరాజ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి కోటకు చేరుకోగా, అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లదాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి చెదరగొట్టారు.  

  • Loading...

More Telugu News