Yashasvi Jaiswal: పెర్త్ టెస్టులో ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్
- టెస్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచిన యువ బ్యాటర్
- 2024లో మొత్తం 34 సిక్సర్లు కొట్టిన జైస్వాల్
- న్యూజిలాండ్ దిగ్గజం మెక్‌కల్లమ్ రికార్డు బద్దలు
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అంతగా రాణించలేకపోవడంతో... ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎలా ఆడుతాడోనంటూ సందేహాలు వ్యక్తం చేసిన వారికి యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ... రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. శభాష్ అనిపించుకునేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీకి చేరువయ్యాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జైస్వాల్ ఆట మూడవ రోజున సెంచరీ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కాగా రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మొత్తం 193 బంతులు ఎదుర్కొని 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లతో పాటు 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. దీంతో జైస్వాల్ ఖాతాలో ఒక ప్రపంచ రికార్డు చేరింది. టెస్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. పెర్త్ టెస్టులో ఇప్పటివరకు బాదిన 2 సిక్సర్లతో కలుపుకొని 2024లో అతడు కొట్టిన సిక్సర్ల సంఖ్య 34కు చేరింది. 2014లో 33 సిక్సర్లతో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు
టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు..
1. యశస్వి జైస్వాల్ - 34 సిక్సర్లు (2024)
2. బ్రెండన్ మెక్‌కల్లమ్ - 33 సిక్సర్లు ( 2014)
3. బెన్ స్టోక్స్ - 26 సిక్సర్లు (2022)
4. ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 22 సిక్సర్లు (2005)
5. వీరేంద్ర సెహ్వాగ్ - 22 సిక్సర్లు (2008)
కాగా పెర్త్ టెస్టులో రెండు సిక్సర్లు కొట్టడానికి జైస్వాల్ చాలా సమయం తీసుకున్నారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌పై ఒక భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ బౌలింగ్‌లో లాంగ్-ఆన్‌లో 100 మీటర్ల సిక్సర్ కొట్టాడు.