Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం పదవి అంశంపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్
- ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి వివాదం లేదన్న ఫడ్నవీస్
- మహాయుతి కూటమి నేతలు చర్చించుకొని నిర్ణయిస్తారని స్పష్టీకరణ
- అసలైన శివసేన ఎవరిదో ప్రజలు తేల్చారన్న ఫడ్నవీస్
ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి వివాదం లేదని, తదుపరి సీఎం ఎవరనేది 'మహాయుతి' కూటమి నేతలు నిర్ణయిస్తారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. మూడు పార్టీల నేతలు కలిసి చర్చించుకొని సీఎంను నిర్ణయిస్తారన్నారు. అందరి అంగీకారం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించింది.
288 సీట్లకు గాను మహాయుతి 230కి పైగా సీట్లను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 174 సీట్లను గెలుచుకున్న మహాయుతి మరో 57 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి కేవలం 53 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ సొంతగా 170 వరకు సీట్లు సాధించింది.
ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ... నిజమైన బాల్ ఠాక్రే శివసేన ఎవరిదనేది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు చూపించారన్నారు. ఇది బీజేపీ విజయమని, ఇందులో తన పాత్ర చిన్నది అన్నారు. ఓటర్ల నమ్మకాన్ని తాము వమ్ము చేయబోమన్నారు. ఇది చారిత్రాత్మక విజయమని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.