KTR: జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి మాకే ధైర్యం చెప్పారు: కేటీఆర్

KTR meets Parnam Narendar Reddy in jail

  • నా కోసం కాదు.. రైతుల కోసం కొట్లాడమని నరేందర్ రెడ్డి మాతో చెప్పారన్న కేటీఆర్
  • కక్షపూరితంగా నరేందర్ రెడ్డిని జైల్లో వేశారని ఆగ్రహం
  • వేధింపుల కారణంగా మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శ

నా కోసం కాదు... రైతుల కోసం కొట్లాడండని జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తమతో చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు సంఘీభావంగా చేస్తున్న ధర్నా బాగా చేయాలని తమతో అన్నారని పేర్కొన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, తదితరులు కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

"లగచర్ల మా గిరిజనుల పంచాయతీ... ఈ విషయం రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేలా చూడండని నరేందర్ రెడ్డి మాకు ధైర్యాన్ని... ఉత్సాహాన్ని ఇచ్చారు" అని కేటీఆర్ తెలిపారు. లగచర్ల ఘటనపై న్యాయస్థానంలో కొట్లాడుతామన్నారు. కోర్టులో రైతులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పేద, గిరిజన, దళిత, బలహీనవర్గాల రైతుల తరఫున పోరాటం చేసినందుకు... రేవంత్ రెడ్డి కక్షపూరితంగా పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో వేశారని ఆరోపించారు. జైల్లో ఆయనను కలిసినప్పుడు తమకు ఒకటే మాట చెప్పారని... తన గురించి ఆలోచించవద్దని చెప్పారని తెలిపారు. కానీ చేయని తప్పుకు 30 మంది అమాయక రైతులను జైల్లో పెట్టారని, ఆ కొడంగల్ పేద రైతుల పక్షాన ఉండాలని తమకు పట్నం నరేందర్ రెడ్డి సూచించారన్నారు.

మంచి పొలాలను లాక్కొని... అక్కరలేని ఫార్మా విలేజ్‌ని కొడంగల్ రైతులపై రుద్దుతున్నారని పట్నం మహేందర్ రెడ్డి తమతో చెప్పారన్నారు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె వరకు అరాచకాలు చేస్తున్న వారు గద్దెనెక్కి కూర్చున్నారని, రైతులు మాత్రం జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వమని చెప్పినందుకు ఆడవాళ్లు, చిన్నపిల్లలు అని చూడకుండా దారుణంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి గెలుపు కోసం పని చేసిన 85 ఏళ్ల మాజీ సర్పంచ్ సాయిరెడ్డిని కూడా వేధించారని ఆరోపించారు. ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టారని, దీంతో మనస్థాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నియంతలెందరో కాలగర్భంలో కొట్టుకుపోయారని, నీలాంటి వాళ్లు అలా కొట్టుకుపోతారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. చేయని తప్పుకు రైతులను జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News