Gudivada Amarnath: జగన్ ఏం చేసినా తప్పు... చంద్రబాబు ఏది చేసినా ఒప్పా?: గుడివాడ అమర్నాథ్
- సెగ పుట్టిస్తున్న 'సెకీ'తో గత ప్రభుత్వం ఒప్పందం
- ఈ ఒప్పందం ద్వారా అప్పటి సీఎం జగన్‌కి భారీ మొత్తంలో లంచం అందినట్టు కథనాలు
- ఈ నేపథ్యంలోనే జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ నేతల విమర్శ
- టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి మండిపాటు
జగన్ ఏం చేసినా తప్పు... చంద్రబాబు ఏది చేసినా ఒప్పు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కి భారీ మొత్తంలో లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్టు కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99లకు కొనుగోలు చేస్తే లేని తప్పు... జగన్ కేవలం యూనిట్ విద్యుత్ రూ.2.49లకే కొనుగోలు చేస్తే మాత్రం అది పెద్ద తప్పు అన్నట్లుగా దుష్ప్రచారం చేయడం ఏమిటని అమర్నాథ్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎక్కడ అవినీతి జరిగిందంటూ ప్రశ్నించారు. సరే తప్పు జరిగిందని భావిస్తే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఈ కూటమి సర్కార్ రద్దు చేస్తుందా? అని నిలదీశారు.