Mahayuti Alliance: మహారాష్ట్రలో మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది: చంద్రబాబు
- నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- తిరుగులేని విజయం దిశగా మహాయుతి కూటమి
- మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకానికి ఇది నిదర్శనమన్న చంద్రబాబు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి కూటమి (ఎన్డీయే) ప్రభంజనం సృష్టించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా... మహాయుతి కూటమి 222 స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది.
ఈ క్రమంలో, మహారాష్ట్ర ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మహారాష్ట్రలో చారిత్రక విజయం సాధించిన మహాయుతి కూటమికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కొనసాగుతోందని చెప్పడానికి ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. వ్యూహాత్మక దార్శనికత, గుణాత్మక మార్పు దిశగా ప్రభుత్వ విధానాలు, ప్రజల పట్ల ప్రేమాభిమానాలతో వికసిత్ భారత్ కు బాటలు పరుస్తున్న మోదీని ప్రజలు మరోసారి విశ్వసించారని చంద్రబాబు వివరించారు.