Balineni Srinivasa Reddy: సెకితో ఒప్పందంపై బాలినేని శ్రీనివాస‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Balineni Srinivasa Reddy Comments on Gautam Adani SECI Solar Bid

  • అర్ధరాత్రి ఒంటిగంట‌కు నిద్రలేపి సంతకం చేయమన్నార‌న్న‌ బాలినేని
  • ఏదో మతలబు ఉందనిపించి తాను సంతకం పెట్టలేదని వెల్ల‌డి
  • మ‌రుస‌టి రోజు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నార‌న్న మాజీ మంత్రి
  • తాను మాత్రం ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని వెల్ల‌డి

సౌరవిద్యుత్‌ ఒప్పందానికి సంబంధించి నాటి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక విషయాలను పంచుకున్నారు. సెకి ఒప్పందం వెనుక ఇంత మ‌త‌ల‌బు ఉందని ఆనాడు ఊహించలేదని అన్నారు. మ‌రుస‌టి రోజు కేబినెట్‌ సమావేశం ఉందనగా అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్‌ అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్‌ చేసి సెకితో ఒప్పంద ప‌త్రాల‌పై సంతకం చేయమన్నారని బాలినేని తెలిపారు.

కానీ, అంత పెద్ద ఒప్పందంపై అది కూడా తనతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే ఏదో మతలబు ఉందనిపించి తాను సంతకం పెట్టలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని తన పీఎస్‌ అంతకుముందే అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. కాసేపటి తర్వాత శ్రీకాంత్‌ తన అదనపు పీఎస్‌కు ఫోన్‌ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని మంత్రిమండ‌లి సమావేశానికి పంపాలని చెప్పారని బాలినేని తెలిపారు.

శ్రీకాంత్‌ చెప్పినట్లే ఉదయమే కేబినెట్ ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లానని బాలినేని వివ‌రించారు. మంత్రిమండలి సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదించేశారని తెలిపారు. కేబినెట్ అనుమ‌తితో ప్ర‌భుత్వ‌మే ఒప్పందం కుదుర్చుకుంద‌న్నారు. తాను మాత్రం ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని తెలిపారు. అంతా పెద్ద మంత్రి నడిపించారని బాలినేని చెప్పుకొచ్చారు. 

అలా తన నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఒప్పందం జరిగిపోయిందని వివ‌రించారు. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు తనకెందుకు చెబుతారని వ్యాఖ్యానించారు. అప్పుడ‌ప్పుడు శ్రీకాంత్‌ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారని, పూర్తి వివరాలు ఎప్పుడూ త‌న‌తో చెప్పలేదని బాలినేని అన్నారు.

  • Loading...

More Telugu News