KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు... స్పందించిన కేటీఆర్
- స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న కేటీఆర్
- రీజనబుల్ పీరియడ్‌లో అని హైకోర్టు చెప్పిందన్న కేటీఆర్
- రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలని సుప్రీంకోర్టు చెప్పిందని వెల్లడి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
మొన్నటి వరకు స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు రీజనబుల్ పీరియడ్ అని చెప్పిందని తెలిపారు. రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు.