Stock Market: దూసుకుపోయిన మార్కెట్లు.. 1,961 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- కొనుగోళ్ల మద్దతుతో కళకళలాడిన సూచీలు
- 557 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2 శాతానికి పైగా పెరిగిన అదానీ పోర్ట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. కొనుగోళ్ల మద్దతుతో ఈరోజు సూచీలు కళకళలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,961 పాయింట్లు ఎగబాకి 79,117కి చేరుకుంది. నిఫ్టీ 557 పాయింట్లు పెరిగి 23,907 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని కంపెనీలు లాభాలను మూటకట్టుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.51%), టీసీఎస్ (4.13%), టైటాన్ (4.10%), ఐటీసీ (3.92%), ఇన్ఫోసిస్ (3.75%) టాప్ గెయినర్లుగా నిలిచాయి.
మరోవైపు నిన్న భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు నేడు కోలుకున్నాయి. అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా లాభపడింది.