Russia: రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో ఉక్రెయిన్ అతలాకుతలం
- రాజధాని కీవ్, ఒడెస్సా, డినిప్రోపెట్రోవిస్క్‌లలో నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా
- అత్యవసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం
- చీకట్లో భయంభయంగా గడుపుతున్న కోట్లాదిమంది
- ఇటీవల ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగంపై రష్యా సీరియస్
- హెచ్చరించినట్టుగానే కీవ్‌పై విరుచుకుపడిన రష్యా
రష్యా ప్రయోగించిన ఖండాంతర క్షిపణితో ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇరు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
రష్యా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత ఉక్రెయిన్‌లో కోట్లాదిమందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్, ఒడెస్సా, డినిప్రోపెట్రోవిస్క్‌లలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అమెరికా తయారీ దీర్ఘశ్రేణి క్షిపణులు ఏటీఏసీఎంఎస్‌లను ఉక్రెయిన్ ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా... నిన్న ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణిని పరీక్షించి తమ ఉద్దేశాన్ని చాటిచెప్పింది. తనపై పశ్చిమ దేశాల క్షిపణుల ప్రయోగానికి అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా, దాని మిత్ర దేశాలను రష్యా కొన్ని నెలలుగా హెచ్చరిస్తూ వస్తోంది.
అయినప్పటికీ రష్యా భూభాగంపైకి ఏటీఏసీఎంఎస్‌లను పరీక్షించేందుకు బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చింది. ఆ వెంటనే ఉక్రెయిన్ వాటిని ప్రయోగించింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన మాస్కో నాయకత్వం... ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి కీవ్‌కు హెచ్చరికలు జారీచేసింది.