Australia vs India: పెర్త్ టెస్టు.. టీమిండియా ఆలౌట్.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్!
- పెర్త్ వేదికగా భారత్, ఆసీస్ తొలి టెస్టు
- తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ భారత్ ఆలౌట్
- 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన నితీశ్ కుమార్ రెడ్డి
- 4 వికెట్లతో చెలరేగిన హెజిల్‌వుడ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 43 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా భారత ఇన్నింగ్స్ గాడిలో పడలేదు. వెంటవెంటనే మరో రెండు వికెట్లు పారేసుకుంది. దాంతో 73 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత పంత్‌తో జతకట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఒకనొక దశలో జట్టు స్కోర్ వంద దాటడం కూడా కష్టమనుకున్న సమయంలో ఈ ద్వయం 48 పరుగుల భాగస్వామ్యం అందించింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. దాంతో 121 పరుగుల వద్ద పంత్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్ బుమ్రా, హర్షీత్ రాణా వికెట్లు కూడా పడ్డాయి.
చివరి వరకు క్రీజులో ఉన్నా నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరికి భారత్ 49.4 ఓవర్లలో 150 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో హెజిల్‌వుడ్ 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.