Mohan Babu: మోహన్ బాబు ది గ్రేట్.. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం!
- నటుడిగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు
- నిర్మాతగా 75 చిత్రాలను నిర్మించిన ఘనత
- 'స్వర్గం నరకం' చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం
విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్ గా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు... నటుడిగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణతో ఐదు దశాబ్దాలుగా నటుడిగా సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. నటుడిగా కొనసాగుతూనే... నిర్మాతగా 75 చిత్రాలను ఆయన నిర్మించారు.
మోహన్ బాబు తొలినాళ్లలో విలన్ గా నటించారు. 1975 నుంచి 1990 వరకు ఆయన విలన్ పాత్రలకు కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న విలన్ లలో ఆయన ఒకరిగా నిలిచారు. 'స్వర్గం నరకం' చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
1990వ దశాబ్దంలో, మోహన్ బాబు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. 1993లో ఆయన నిర్మించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రం... ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది.
మోహన్ బాబు తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గౌరవపురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. 2016లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయనను వరించింది.
నటుడిగా మోహన్ బాబు 50 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భాన్ని ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు ఘనంగా సెలెబ్రేట్ చేయబోతున్నారు. 2024 డిసెంబర్ నుండి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను నిర్వహిస్తారు. 2025 నవంబర్ వరకు ప్రతి నెల ఒకటో తేదీన ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని విష్ణు తెలిపారు.