Tokyo: ‘టోక్యో’ నగరానికి ఏమైంది?.. అక్కడి మహిళలు ఎందుకిలా మారిపోతున్నారు?
- సెక్స్ టూరిజం హబ్‌గా మారిపోతున్న టోక్యో
- పెరుగుతున్న విదేశీ సందర్శకులు
- జీవనం కోసం పడుపు వృత్తిని ఎంచుకుంటున్న జపాన్ టీనేజర్లు, అమ్మాయిలు
ఆర్థిక ప్రగతిని సాధించిన నగరంగా... అన్ని విధాలా అభివృద్ధి చెందిన అత్యాధునిక సిటీగా జపాన్ రాజధాని టోక్యోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ నగరం ‘సెక్స్ టూరిజం’ కేంద్రంగా కూడా మారిపోయింది. మహిళలను వెతుకుతూ టోక్యో నగర వీధుల్లో పురుషులు తిరుగాడటం సాధారణ దృశ్యాలుగా మారిపోయాయి.
ఇన్నాళ్లూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరం సెక్స్ టూరిజానికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు టోక్యో నగరం కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఇందుకోసం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే జపనీస్ యెన్ విలువ గణనీయంగా బలహీనపడటం, జపాన్ టూరిజం కూడా బలంగా పుంజుకోవడం టోక్యో నగరం కొత్త గుర్తింపునకు కారణం అవుతున్నాయి.
ఈ పరిణామంపై జపాన్ యువత వికాసం కోసం పనిచేసే లైసన్ కౌన్సిల్ ప్రొటెక్టింగ్ యూత్స్ సెక్రటరీ జనరల్ యోషిహిడే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జపాన్ పేద దేశంగా మారిందని అన్నారు. టోక్యో సిటీలో ఈ సంస్థ పక్కన ఉన్న పార్క్ లైంగిక వ్యాపారానికి పర్యాయపదంగా మారిపోయిందని అన్నారు. మహమ్మారి కరోనా అనంతరం ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడంతో పార్కును సందర్శించే విదేశీయుల సంఖ్య పెరుగుతున్నట్లు తాము గమనించామని ఆయన వెల్లడించారు.
చాలా దేశాల నుంచి వస్తున్నారని, ఆసియావారు ఎక్కువగా ఉంటున్నారని, అందులోనూ చైనీయులు ఎక్కువగా ఉంటున్నారని యోషిహితే అన్నారు. యుక్త వయసు, ఇరవై ఏళ్ల ఆరంభ వయసుల అమ్మాయిలు తమ జీవనం కోసం సెక్స్ పరిశ్రమ వైపు మొగ్గుచూపుతుండడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. విదేశీ పురుషులు జపాన్ యువతుల లైంగిక సేవలను కొనుగోలు చేయగల ప్రదేశంగా మారిపోయిన మాట వాస్తవమని అన్నారు.