Rahul Gandhi: రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా నిలిచిపోయిన విద్యుత్... బీజేపీ చురక
- కరెంట్ కోతకు అదానీ పవర్, మోదీ పవర్ కారణమన్న రాహుల్ గాంధీ
- పక్కనే ఉన్న జైరాం రమేశ్ విద్యుత్ ప్లగ్‌ను తీసేసి ఉంటారని బీజేపీ చురక
- అదానీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ వినియోగించుకుంటున్నారని విమర్శ
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న మీడియా సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయన మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన మాట్లాడేందుకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ కరెంట్ కోతకు అదానీ పవర్, మోదీ పవర్ కారణమని ఆరోపించారు.
రాహుల్ సమావేశంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ప్రధాని మోదీ గురించి రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పారని, ఆయన ప్రెస్ మీట్‌లో కాసేపటికే కరెంట్ వచ్చిందని బీజేపీ నేత సంబిత్ పాత్ర గుర్తు చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో ఆ పార్టీ నేత జైరాం రమేశ్ కూడా పక్కనే ఉన్నారని... రాహుల్ ను ఆపలేక ఆయనే విద్యుత్ ప్లగ్‌ను తీసేసి ఉంటారని ఎద్దేవా చేశారు.
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు కొవిడ్ సహా ఎన్నో అంశాల గురించి అవాస్తవాలను మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు అదానీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ వినియోగించుకుంటున్నారని విమర్శించారు.