Women: ఆడవాళ్లలో నిద్ర తక్కువ... ఎందుకంటే!
- కొలరాడో యూనివర్సిటీ ఆసక్తికర అధ్యయనం
- ఎలుకలపై ప్రయోగాలు చేసిన పరిశోధకులు
- జీవ సంబంధ అంశాలు మహిళల నిద్రను ప్రభావితం చేస్తుంటాయని వెల్లడి
ఎంత ఆధునిక కాలం అయినప్పటికీ, స్త్రీలు అనేక రంగాల్లో పురుషులకు దీటుగా నిలుస్తున్నా, బయటి బాధ్యతలతో పాటు ఇంటి బాధ్యతల భారం చాలావరకు స్త్రీలే మోస్తున్నారు. ఈ ధోరణి మహిళల ఆరోగ్యంపై, ముఖ్యంగా వారి నిద్రపై ప్రభావం చూపిస్తుంటుంది.
అయితే, మహిళలు తక్కువగా నిద్రపోవడానికి కొన్ని జీవ సంబంధ అంశాలు కూడా కారణమేనని తాజాగా ఓ అధ్యయనం చెబుతోంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
మానవ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర అవసరం. కానీ, మహిళలు పురుషులతో పోల్చితే తక్కువ సమయం నిద్రపోవడమే కాకుండా, తరచుగా నిద్ర మధ్యలో మేల్కొంటారట. పురుషులు, మహిళల నిద్రలో వ్యత్యాసాలు అనే అంశంపై కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనంలో భాగంగా... ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు.
ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఇంటరాగేటివ్ ఫిజియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచెల్ రోవ్ స్పందిస్తూ... మానవుల్లో మహిళలు, పురుషులకు వేర్వేరు నిద్రా విధానాలు ఉంటాయని వెల్లడించారు. మహిళల విషయానికొస్తే నిద్రను జీవనశైలి అంశాలు, వారు మోసే బాధ్యతలు ప్రభావితం చేస్తుంటాయని వివరించారు. అయితే, జీవ సంబంధ అంశాలే మహిళల్లో తక్కువ నిద్రకు ముఖ్య కారణం కావొచ్చన్న అంశం తమ పరిశోధన ద్వారా గుర్తించామని చెప్పారు.
కొలరాడో వర్సిటీ బృందం చేపట్టిన పరిశోధనలో... మొత్తం 24 గంటల్లో మగ ఎలుకలు 670 నిమిషాలు నిద్రపోగా... ఆడ ఎలుకలు 610 నిమిషాలే నిద్రపోయాయట. తద్వారా బాహ్య అంశాల కంటే, జీవ సంబంధ కారకాలు స్త్రీల నిద్రను ప్రభావితం చేస్తుంటాయన్న విషయం స్పష్టమవుతోందని రాచెల్ రోవ్ వివరించారు. ఆ లెక్కన స్త్రీలు సున్నితమైన జీవులుగానే భావించాలని అన్నారు. నిర్దిష్ట వ్యవధితో కూడిన నిద్ర లేకపోతే... శరీరం మరమ్మతులు చేసుకునే శక్తిని కోల్పోతుందని తెలిపారు.