Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయింది: న్యాయవాది

Actor Nagarjuna lawyers arguments in Nampally court

  • పరువు నష్టం కేసులో వాదనలు వినిపించిన నాగార్జున తరఫు న్యాయవాది
  • మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు సరికాదని వెల్లడి
  • కొండా సురేఖ కచ్చితంగా క్రిమినల్ చర్యలకు అర్హురాలేనని స్పష్టీకరణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. మంత్రిపై నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నాగార్జున దావా వేయడంతో కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈరోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫున అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు.

నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో మంత్రి పెట్టిన పోస్టును న్యాయవాది చదివి కోర్టుకు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొండా సురేఖ కచ్చితంగా క్రిమినల్ చర్యలకు అర్హురాలు అన్నారు.

ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. ఆ తర్వాత కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు.

నాగార్జునపై వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ... ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ ట్వీట్ కూడా చేశారు. తన వ్యాఖ్యల వల్ల మీరు గానీ, మీ అభిమానులు గానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అన్యదా భావించవద్దని కొండా సురేఖ ఎక్స్ వేదికగా ఆ రోజే క్షమాపణలు చెప్పారు. ఈ ట్వీట్‌ను న్యాయవాది ఈరోజు కోర్టులో చదివి వినిపించారు.

  • Loading...

More Telugu News