Pawan Kalyan: తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబే కారణం: పవన్ కల్యాణ్
- వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిందని ఆగ్రహం
- వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న పవన్ కల్యాణ్
- మంచి నీటి సమస్యను తీర్చే బాధ్యత తనదేనని హామీ
తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లిందని ఆరోపించారు.
కానీ భవిష్యత్తు పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలోనూ నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వైసీపీ దోపిడీ, అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా సంతృప్తి చెందామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తోందని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
మంచినీటి సమస్యను తీర్చే బాధ్యత నాదే
రాష్ట్రంలో మంచినీటి సమస్యను తీర్చే బాధ్యత తనదేనని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రక్షిత మంచి నీరు ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. జలజీవన్ మిషన్‌పై ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలు తగ్గిస్తామన్నారు. పాడైన ఆర్వో ప్లాంట్లను పునరుద్ధరిస్తామన్నారు.