Botsa: వాలంటీర్ వ్యవస్థ లేదనడం దారుణం: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana comments on Volunteers

  • వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి బాల వీరాంజనేయస్వామి
  • వాలంటీర్ల రెన్యువల్ జీవోను కూటమి ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా అన్న బొత్స
  • వాలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందన్న రామసుబ్బారెడ్డి

వాలంటీర్ల అంశం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ... రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పారు. 2023 ఆగస్ట్ లో వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని... ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించే జీవో జారీ చేయలేదని చెప్పారు. లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అన్నారు. 

ఈ క్రమంలో వైసీపీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... వాలంటీర్ల వేతనం రూ. 10 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆ వ్యవస్థే లేదనడం దారుణమని అన్నారు. వాలంటీర్ల రెన్యువల్ జీవోను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా? అని అన్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ... వాలంటీర్ల విషయంలో వైసీపీ అనుమానాలే నిజమయ్యాయని చెప్పారు. వాలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుందని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ చెపుతూనే వస్తోందని అన్నారు. ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానంతో ఆ కుట్ర నిజమేనని తేలిందని చెప్పారు.


  • Loading...

More Telugu News