Gachibowli: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. ప్రాణ భయంతో జనం పరుగులు.. వీడియో ఇదిగో!
- పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టడమే కారణం
- మంగళవారం రాత్రి ఘటన.. రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు
- బుధవారం బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించిన అధికారులు
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనలకు గురైన జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్నపళంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్ధిఖీ నగర్ లో తనకున్న 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి. మొత్తం 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. లక్ష్మణ్ ఇంటి పక్కనే ఇటీవల మరో బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
సెల్లార్ కోసం భారీ గుంత తవ్వడంతో మంగళవారం రాత్రి లక్ష్మణ్ కు చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాస్తా పక్కకు ఒరిగింది. దీంతో అందులోని కిరాయిదారులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. మూడో అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చుట్టుపక్కల బిల్డింగ్ లలో ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లల్లో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు. పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను బుధవారం ఉదయం హైడ్రాలిక్ మిషిన్ సాయంతో కూల్చివేత చేపట్టారు.
పొలం అమ్మి కట్టుకున్నాం..
ఊరిలో ఉన్న పొలం అమ్మి రెండేళ్ల క్రితమే భవనం కట్టుకున్నామని సదరు బిల్డింగ్ యజమాని స్వప్న చెప్పారు. తమ ఇంటి పక్కనే భారీ గుంత తవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బిల్డింగ్ కూలితే చుట్టుపక్కల వారికి ఇబ్బంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూల్చివేత చేపట్టడంపై తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే, బిల్డింగ్ పక్కకు ఒరగడానికి కారణం పక్కనే జరుగుతున్న నిర్మాణ పనులే కాబట్టి సదరు స్థలం యజమాని నుంచి తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పొలం అమ్మి, అప్పు చేసి కట్టుకున్న బిల్డింగ్ కోల్పోయామని, పరిహారం ఇవ్వకుంటే తన కుటుంబం రోడ్డున పడాల్సిందేనని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.