Viral News: ఉద్యోగులను డేటింగ్‌కు ప్రోత్సహిస్తూ నగదు ప్రోత్సాహం ప్రకటించిన కంపెనీ
- చైనా టెక్ కంపెనీ ‘ఇన్‌స్టా360’ సరికొత్త ఆఫర్
- పని ప్రదేశంలో ఉద్యోగులు అన్ని విధాలా సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ నిర్ణయం
- కంపెనీ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌పై పార్టనర్‌ని పరిచయం చేస్తూ పోస్ట్ పెడితే రూ.770 ప్రోత్సాహం
- మూడు నెలలపాటు డేటింగ్ కొనసాగిస్తే రూ.11,650 రివార్డు అందిస్తున్న కంపెనీ
పని ప్రదేశంలో ఉద్యోగులను అన్ని విధాలా సంతోషంగా ఉంచడమే లక్ష్యంగా ఓ కంపెనీ వినూత్న విధానాన్ని ఎంచుకుంది. ఒంటరిగా జీవిస్తున్న ఉద్యోగులను డేటింగ్ వైపుకు పురిగొల్పుతోంది. ఇందుకోసం నగదు ప్రోత్సాహకాలను కూడా ఆఫర్ చేస్తోంది. దక్షిణ చైనాలోని షెన్‌జెన్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఇన్‌స్టా 360’ అనే టెక్ కంపెనీ ఒంటరి ఉద్యోగులను డేటింగ్ చేయాలంటూ ప్రోత్సహిస్తోంది. కంపెనీ వెలుపల వ్యక్తులతో డేటింగ్ మొదలుపెట్టామంటూ కంపెనీకి చెందిన డేటింగ్ ప్లాట్‌ఫామ్‌పై పార్టనర్‌ని పరిచయం చేస్తూ చెల్లుబాటయ్యే పోస్ట్ పెడితే 66 యువాన్లు (సుమారు రూ.770) చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది. డేటింగ్‌ను మూడు నెలల పాటు కొనసాగిస్తే డేటింగ్‌లో ఉన్న జంటతో పాటు మ్యాచ్ వెతికిపెట్టినవారికి కూడా 1,000 యువాన్లు (సుమారు రూ. 11,650) చొప్పున రివార్డ్ అందిస్తామని కంపెనీ ప్రకటించినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం పేర్కొంది.
ఉద్యోగుల్లో ‘మనది అనే భావన’ కలిగించడంతో పాటు వారిలో సంతోషాన్ని నింపాలనే లక్ష్యంతో ఈ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు ఇన్‌స్టా360 కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి కంపెనీ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌పై దాదాపు 500 పోస్ట్‌లు పబ్లిష్ అయ్యాయని, దాదాపు 10,000 యువాన్ల మేర కంపెనీ నగదు అవార్డులను అందజేసిందని వెల్లడించారు. మూడు నెలల క్రితమే మొదలవడంతో డేటింగ్ బోనస్‌లు ఇంకా ఇవ్వలేదని వివరించారు.
ఈ వినూత్న కార్యక్రమంపై ఉద్యోగులు మిశ్రమ స్పందనలు తెలియజేస్తున్నారు. ‘నా విషయంలో మా అమ్మ కంటే కంపెనీ చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా ఉంది’ అని ఓ ఉద్యోగి చమత్కరించాడు. మరొక ఉద్యోగి స్పందిస్తూ.. నగదు ప్రోత్సాహకాలు సరైన విధానమేనా అని ప్రశ్నించాడు. కంపెనీకి రిక్రూట్‌మెంట్ ఆలోనలు ఏమైనా ఉన్నాయా అని ఒకరు, ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అనుసరించాలని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు. మరికొందరు మాత్రం ఈ విధానాన్ని తప్పుబట్టారు. డబ్బుతో ప్రేమను కొనలేరని వ్యాఖ్యానించారు. చైనాలో పెళ్లిళ్లు, జననాల రేట్లు రెండింటి విషయంలో గణనీయ తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం.