Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు

Harish Rao who satirized not victory celebrations but failure celebrations

  • ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతున్నారంటూ సీఎంని ప్రశ్నించిన మాజీ మంత్రి
  • అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా మోసం చేశారని వ్యంగ్యాస్త్రాలు
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేసిన బీఆర్ఎస్ అగ్రనేత

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వరంగల్ వేదికగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత టి.హరీశ్ రావు సెటైర్లు వేశారు. విజయోత్సవాలు కాదు... అపజయోత్సవాలు జరపండి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా మోసం చేసిందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని అన్నారు.

పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకెళ్లారని హరీశ్ రావు విమర్శించారు. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని. ఎవరునుకున్నరు ఇట్లవునని’ అని ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని అన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని వ్యాఖ్యానించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి విమర్శించారు.

ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాది అయినా అతీగతీ లేదని వ్యాఖ్యానించారు. డిక్లరేషన్‌లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదని ప్రస్తావించారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15 వేల భరోసా దిక్కులేదని విమర్శించారు. 

‘‘ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తానన్న రూ.12 వేలు ఇవ్వనేలేదు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారు. ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? మీ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లింది. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ... నేడు తిరోగమనం బాట పట్టింది. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి నెలకొంది’’ అని హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు.

  • Loading...

More Telugu News