Ponguleti Srinivas Reddy: గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయటపెట్టలేదు?: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామన్న మంత్రి
- ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇస్తే తీసుకుంటామని వ్యాఖ్య
- తమ ప్రభుత్వం ఏ పనినీ కక్షపూరితంగా చేయడం లేదని వెల్లడి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల క్రితం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయట పెట్టలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కులగణనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కులగణన సర్వేను చేపట్టిందన్నారు. కులగణనపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్థం లేనివి అన్నారు. కులగణన శాస్త్రీయంగా చేస్తున్నట్లు చెప్పారు. మనిషి ఎక్స్‌రే మాదిరిగా సర్వే జరుగుతోందన్నారు. తమ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్ష పూరితంగా చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.