TTD: సర్వదర్శనం భక్తులకు ఇకపై 2 నుంచి 3 గంటల్లో దర్శనం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సమావేశం అనంతరం వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- తిరుమలలో ఇకపై రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు
- శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు
- పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు
నేడు తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ నాయుడు తాము తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆ పథకం కొనసాగుతుందని, ఆ నిధులను మాత్రం ప్రధాన ట్రస్టుకు తరలిస్తామని అన్నారు.
సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభించేలా చూస్తామని వివరించారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని వివరించారు.
టీటీడీలో పనిచేసే అన్యమతాలకు చెందిన ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేస్తామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని బీఆర్ నాయుడు వెల్లడించారు.
తిరుమలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తామని, లడ్డూ నాణ్యత మరింత పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.
డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామని అన్నారు. తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కు గరుడ వారధిగా పేరు మార్చామని బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో ఇకపై రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు చేపడతామని తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని స్పష్టం చేశారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వం బ్యాంకుల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
ముఖ్యంగా, శారదా పీఠం లీజును రద్దు చేసి, స్థలాన్ని తిరిగి తీసుకుంటామని చెప్పారు. ముంతాజ్ హోటల్స్ కు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాల లీజును రద్దు చేస్తున్నట్టు బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
టూరిజం శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. టూరిజం శాఖకు కేటాయించే 4 వేల టికెట్లను రద్దు చేస్తున్నామని అన్నారు. టూరిజం శాఖకు కేటాయించే టికెట్లలో అవకతవకలు జరిగాయని తెలిపారు.
కాగా, టీటీడీ 2025 క్యాలెండర్ ను కూడా చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఆవిష్కరించారు.