Telangana: గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి కీలక సూచనలు
- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సూచనలు
- హైదరాబాద్ వ్యాప్తంగా 102 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
- ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరు కావాలని సూచన
గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పలు సూచనలు చేశారు. గ్రూప్-3 పరీక్షల కోసం హైదరాబాద్ వ్యాప్తంగా 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒరిజినల్ ఐడీతో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలన్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమయ్యే పేపర్-1కు అభ్యర్థులు ఎనిమిదిన్నరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మధ్యాహ్నం పరీక్షలకు ఒకటిన్నర కల్లా రావాలని సూచించారు.
ఉదయం జరిగే పరీక్షకు తొమ్మిదిన్నర తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు రెండున్నర గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్ కాపీని అభ్యర్థులు భద్రంగా ఉంచుకోవాలన్నారు. మొదటి రోజు తీసుకువచ్చిన హాల్ టిక్కెట్ కాపీనే మిగతా పరీక్షలకు కూడా తీసుకురావాలన్నారు. నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రశ్నాపత్రాలు, హాల్ టిక్కెట్లు భద్రంగా దాచుకోవాలని సూచించారు. కాగా, రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలు జరగనున్నాయి.