Honey: తేనె, పసుపు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Do you know what happens if you take honey and turmeric together

  • రెండూ కూడా సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న పదార్థాలే!
  • మన శరీరానికి మేలు చేయడంలో రెండూ ఉత్తమమైనవే!
  • కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం అంటున్న నిపుణులు

ప్రకృతిలో లభించే సహజ పదార్థాలలో తేనె, పసుపు రెండింటికీ ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. రెండూ కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నవే. దీంతోపాటు కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడం, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అద్భుతమైన లక్షణాలు వీటి సొంతం. మరి ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల ఏమవుతుందో తెలుసా? వైద్య నిపుణులు, డైటీషియన్లు ఏం చెబుతున్నారో చూద్దామా...!

విడి విడిగా అయినా, కలిపి అయినా... అన్నీ లాభాలే!
  • తేనె, పసుపు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
  • తేనె, పసుపు రెండూ శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు)ను తగ్గిస్తాయి. రెండింటిలో ఉండే సహజమైన ఎంజైములు కలసి... మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఈ రెండూ కూడా దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేసేవే. అలాంటిది రెండూ కలిపి వాడటం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • పసుపులో ఉండే కర్క్యుమిన్ మెదడు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని మెరుగు పరిస్తే... తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఒత్తిడి, వయసు ఆధారిత క్షీణత నుంచి రక్షిస్తాయి. అంటే మొత్తంగా మెదడు పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుందన్న మాట.
  • తేనె, పసుపు కలిపి వాడటం వల్ల శరీరంలో మెటబాలిజం (జీవక్రియల) వేగం పెరుగుతుందని... ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఈ రెండు పదార్థాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఇవి మన గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతాయి.

  • Loading...

More Telugu News