Jayam Ravi: ప్రముఖ హీరో విడాకుల పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు ఆసక్తికర సూచన

Chennai family court interesting suggestion to Jayam Ravi and Arthi

  • భార్య ఆర్తి నుంచి విడాకులు కోరుతున్న జయం రవి
  • నేడు పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం
  • జయం రవి, ఆర్తి కూర్చుని చర్చించుకోవాలని సూచన
  • రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాలని హితవు

ప్రముఖ దక్షిణాది హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు కోరుతూ ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం... జయం రవి, ఆర్తిలకు ఆసక్తికర సూచన చేసింది. 

ఇద్దరూ కూర్చుని చర్చించుకోవాలని, సాధ్యమైనంత వరకు రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాలని హితవు పలికింది. అప్పటికీ కుదరకపోతే, ఎందుకు విడిపోవాల్సి వస్తోంది అనేందుకు స్పష్టమైన కారణాన్ని చెప్పాలని సూచించింది. ఈ పిటిషన్ పై విచారణకు జయం రవి స్వయంగా కోర్టుకు హాజరు కాగా, ఆర్తి వీడియో కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చారు.

 జయం రవి, ఆర్తి 2009లో పెళ్లి చేసుకోగా... వారికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా జయం రవి, ఆర్తి విడాకులపై కథనాలు వస్తున్నాయి. ఓ యువ గాయనితో జయం రవికి అఫైర్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 

అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని జయం రవి పేర్కొనగా... జయం రవితో రిలేషన్ ఉందని భావిస్తున్న గాయని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భార్య కారణంగా జయం రవి ఎంతో వేదన అనుభవిస్తున్నారని పేర్కొంది. 

కాగా, భార్య ఆర్తి నుంచి తాను విడిపోతున్నట్టు జయం రవి గత సెప్టెంబరులో ప్రకటించారు. దాంతో, తనకు తెలియకుండానే జయం రవి విడాకుల ప్రకటన చేశారని ఆర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆర్తి... ప్రముఖ తమిళ నిర్మాత సుజాతా విజయ్ కుమార్ కుమార్తె.

More Telugu News