Sunil gavaskar: జీవితంలో ఇప్పుడు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది.. ఇదే ఎక్కువ ఆనందాన్నిస్తోంది: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar bats for quality healthcare for kids

  • హృద్రోగులైన పిల్లల విషయంలో రెండో అవకాశం ఉండదన్న గవాస్కర్
  • సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవ తనకు మూడో ఇన్నింగ్స్ అని వ్యాఖ్య
  • చిన్నారులకు లైఫ్ లైన్ ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడన్న గవాస్కర్

క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ కీలక మ్యాచ్‌లో తాను కొట్టిన బంతిని ఫీల్డర్ రెండుసార్లు వదిలేశాడని, దీంతో తనకు రెండుసార్లు లైఫ్ దొరకడంతో ఆ తర్వాత సెంచరీ చేశానని, ఇది తన కెరీర్‌ను మలుపు తిప్పిందని ప్రఖ్యాత క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తు చేసుకున్నారు. కానీ హృద్రోగులైన పిల్లలకు ఆపరేషన్ చేసే సమయంలో రెండో అవకాశం ఉండదన్నారు. ఆపరేషన్ విజయవంతమైతే ప్రాణాలు దక్కుతాయని, లేదంటే తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందన్నారు.

నిన్న ఆయన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాకలో సత్యసాయి ట్రస్ట్ నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ ట్రస్ట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన జీవితంలో ఇప్పుడు మూడో ఇన్నింగ్స్ నడుస్తోందని, అన్నింటికంటే ఇదే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆపరేషన్‌తో గుండె సమస్యల నుంచి బయటపడిన చిన్నారుల తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని చూస్తే తనకు డబుల్ సెంచరీ చేసిన దాని కంటే ఎక్కువ ఆనందం కలుగుతోందన్నారు.

సత్యసాయి ట్రస్ట్‌తో కలిసి పని చేయడం వల్ల తనకు ఎంతోమంది చిన్నారులకు లైఫ్ లైన్ ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడన్నారు. పిల్లలకు శస్త్ర చికిత్స చేయించడం కోసం ఎన్నో దేశాలు తిరిగి నిధులు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ద్వారా 35 వేల మందికి పైగా చిన్నారులకు ఆపరేషన్ జరిగిందని, ఇందులో 99 శాతం విజయవంతం అయ్యాయన్నారు. క్రికెట్ కంటే మూడో ఇన్నింగ్స్‌లోనే తనకు ఎక్కువ సంతృప్తి కలుగుతోందన్నారు.

నేటి పిల్లలు మైదానానికి దూరంగా ఉంటున్నారని, దీని వల్ల ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు 75 ఏళ్లు దాటినా ఉత్సాహంగా ఉండటానికి కారణం ఆట వల్లే అన్నారు. ఆట వల్ల కలిగే ప్రయోజనాలను సత్యసాయి ట్రస్ట్ విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు. 

  • Loading...

More Telugu News