KTR: సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే ఇష్టం ఉన్నట్లుగా ఉంది: కేటీఆర్
- సీఎంకు సొంత నియోజకవర్గంపై కూడా పట్టు లేదన్న కేటీఆర్
- కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులం కాదన్న కేటీఆర్
- వీళ్లకు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తానంటే చాలా ఇష్టం ఉన్నట్లుగా ఉందని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... సీఎం చెబుతున్న ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ సాధ్యం కావన్నారు. ముఖ్యమంత్రికి తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టు లేదన్నారు. సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులం తాము కాదన్నారు.
ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకురావాలంటే ఎంతో కష్టపడాలని, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు హరీశ్ రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా? అని మండిపడ్డారు. వీళ్లకు ప్రభుత్వం నడపటం చేతకావడం లేదన్నారు. లగచర్ల భూసేకరణలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడినప్పటికీ... కుట్ర అని ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడలేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారన్నారు.
ఈ ఘటనలో కీలక నిందితుడు సురేశ్ బీఆర్ఎస్ కార్యకర్తేనని... కానీ ఆయనకు భూమి ఉందన్నారు. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు వెళ్లారన్నారు.