Nara Lokesh: మండలిలో వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh fires on YCP leaders in legislative council

  • శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారన్న లోకేశ్
  • అందుకే ఆనాడు చంద్రబాబు బాయ్ కాట్ చేశారని వెల్లడి
  • జగన్ రెడ్డి కుటుంబం గురించి తాము ఏనాడూ మాట్లాడలేదని స్పష్టీకరణ

గత వైసీపీ పాలనలో చంద్రబాబు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాతే బాయ్ కాట్ చేశారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆయన ఇవాళ శాసనమండలిలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రచారం పట్ల బదులిచ్చారు. 

"చంద్రబాబు సభ నుంచి పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు హౌస్ కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సభ గౌరవ సభగా మారిన తర్వాతే మళ్లీ వస్తా అన్నారు. నా తల్లిని అవమానించిన విషయం మీకు గుర్తులేదా? 

ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించలేదని మీరు ఏవిధంగా మాట్లాడతారు? మీరున్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారు! ఇవన్నీ గుర్తులేవా మీకు? నేను కూడా మీలాగే మాట్లాడగలను... కానీ, ఏనాడూ మేం మాట్లాడలేదు. జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు. మా సభ్యులు కూడా ఏనాడూ మాట్లాడలేదు. 

శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబు ప్రతి రోజూ హౌస్ కు వచ్చారు. ప్రతి రోజూ హౌస్ లో నిలబడ్డారు. సింగిల్ గా నిలబడ్డారు సింహంలా. గుర్తుపెట్టుకోండి, పోరాడారు. నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక సభను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లారు. సభలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదీ మా చిత్తశుద్ధి! 

మరి, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నా. జగన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని బొత్స అంటున్నారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారు కదా. అది సమర్థించడం కాదా? వైసీపీ మండలిపక్ష నేత బొత్స ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News