Tulsi Gabbard: హిందువే కానీ ఇండియన్ కాదు.. ఎవరీ తులసీ గబ్బార్డ్ ?
- ట్రంప్ టీమ్ లో కీలక పదవి దక్కించుకున్న తులసి
- తొలుత డెమోక్రాట్, ఆపై ఇండిపెండెంట్, చివరకు రిపబ్లికన్
- అమెరికా అధ్యక్ష రేసులో నిలిచినా తుదకు వైదొలిగిన లీడర్
పేరులో తెలుగుదనం, ఆచారంలో హిందుత్వం.. వీటిని చూసి ఆమె హిందువని, తెలుగు మూలాలు ఉన్నాయని చాలామంది పొరబడుతుంటారు. ఆమే.. తులసీ గబ్బార్డ్. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో తొలుత తాను కూడా రేసులో ఉన్నానని ప్రకటించి తులసి సంచలనం సృష్టించారు. చివరకు పోటీ నుంచి వైదొలిగి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తొలినాళ్లలో డెమోక్రటిక్ పార్టీలో కొనసాగిన తులసి, 2022లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. స్వంతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు మనసు మార్చుకుని డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిచ్చారు. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్.. తాజాగా తులసిని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేశారు.
తులసీ గబ్బార్డ్ భారత సంతతికి చెందిన నేత అని, ఆమె మూలాలు భారత్ లో ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాను హిందువునే తప్ప ఇండియన్ కాదని స్వయంగా తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. దీనిపై 2012లోనే ఓ ట్వీట్ చేశారు. కారోల్ గబ్బార్డ్, మైక్ గబ్బార్డ్ దంపతులకు అమెరికాలోని సమోవా ఐలాండ్ లో 1981లో జన్మించింది. తులసి తల్లి కారోల్ ఇండియానాకు చెందిన వారు కాగా తండ్రి మైక్ యురోపియన్ మూలాలున్న అమెరికన్ పౌరుడు. ఆయన సమోవాలో పుట్టిపెరిగారు. తులసికి రెండేళ్ల వయసుండగా గబ్బార్డ్ కుటుంబం హవాయీకి వలస వెళ్లింది. తులసి బాల్యం సమోవా, హవాయీ దీవులతో పాటు ఫ్లోరిడాలో గడిచింది.
హిందుత్వంపై ఆసక్తితో కారోల్ గబ్బార్డ్ తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టింది. తన సంతానం ఐదుగురిలో నాలుగో కూతురుకు తులసి అని నామకరణం చేసింది. కారోల్ గబ్బార్డ్ హిందూ ఆచారాలను పాటిస్తూ తన పిల్లలకు కూడా నేర్పింది. భగవద్గీత చదివించడం, వైష్ణవ హిందూ ఆర్గనైజేషన్ తో పాటు ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవుతుండేది. దీంతో టీనేజ్ కు వచ్చే సరికి తులసికి కూడా హిందుత్వంపై ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచి పాటిస్తున్న ఆచారాలను పాటిస్తూ హిందూ దేవుళ్లపై నమ్మకాన్ని పెంచుకుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తులసి పేరును, ఆచార వ్యవహారాలను చూసి ఆమె పూర్వీకులు భారతీయులని చాలామంది పొరబడ్డారు. ఈ విషయంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తులసీ గబ్బార్డ్ 2012లో ఓ ట్వీట్ చేశారు. తాను హిందువునే కానీ ఇండియన్ కాదని అందులో స్పష్టం చేశారు.