ITDP: పోలీసులు నన్ను కొడుతూ ఆ దృశ్యాలను విడదల రజనీకి చూపించారు: ఐటీడీపీ నేత కోటి
- వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నామని ఐదు రోజులపాటు నిర్బంధించారన్న కోటేశ్వరరావు
- తనను చిత్రహింసలు పెడుతూ నాటి మంత్రి రజనీకి చూపించారని ఆరోపణ
- రజనీ, ఆమె సహాయకులు, చిలకలూరిపేట నాటి సీఐపై ఎస్పీకి ఫిర్యాదు
వైసీపీ నాయకులురాలు, మాజీ మంత్రి విడదల రజనీ, చిలకలూరిపేట అప్పటి సీఐ సూర్యనారాయణపై చిలకలూరిపేట ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు (కోటి) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నామంటూ తనను నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెట్టారని, చిలకలూరిపేట అప్పటి సీఐ తనను కొడుతున్న దృశ్యాలను నాటి మంత్రి విడదల రజనీకి చూపించారని ఆరోపించారు.
పోలీసులు తనను ఐదు రోజులపాటు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని కోటి ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీమంత్రి రజనీ, ఆమె వ్యక్తిగత సహాయకులు జయఫణీంద్రకుమార్, రామకృష్ణ, చిలకలూరిపేట అప్పటి సీఐ సూర్యనారాయణపై ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.