Andhra Pradesh: సోషల్ మీడియాలో ఏదైనా చేస్తామంటే కుదరదు: అసభ్య పోస్టులపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

AP High Court supports cases against objectional social media posts

  • పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిల్
  • అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడితే తప్పేమిటన్న హైకోర్టు
  • ఒకే ఉద్దేశంతో వందలాది మంది పోస్టులు పెడుతున్నారన్న హైకోర్టు
  • పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన హైకోర్టు ధర్మాసనం

సోషల్ మీడియా వేదికగా ఏదైనా చేస్తామంటే కుదరదు... అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ జర్నలిస్ట్ పోలా విజయబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం నిన్న ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీస్ యంత్రాంగం కేసులు నమోదు చేస్తోందని, పోలీసుల తీరుపై విచారణ జరిపించాలని విజయబాబు తన పిల్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున వైసీపీ ప్రభుత్వంలో ఏజీగా పని చేసిన శ్రీరామ్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి వాక్ స్వాతంత్రపు హక్కును హరించేలా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వేలాదిమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ... దూషణలకు దిగుతున్నారని, అసభ్యపోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పేమిటని ప్రశ్నించింది. ఒకే ఉద్దేశంతో వందలాది మంది పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుందని ఘాటుగా ప్రశ్నించింది. కొన్ని సందర్భాలలో న్యాయమూర్తులను కూడా విడిచి పెట్టడం లేదని, కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో పిల్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. 

అసభ్య, అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేమని స్పష్టం చేసింది. దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేయాలి తప్ప ఇది ప్రజాప్రయోజనం కాదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News