Anitha: ఆడవాళ్లను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు... కానీ!: హోంమంత్రి అనిత
- తల్లి, చెల్లిపై పోస్టులు పెట్టిన వాళ్లను జగన్ ఏమీ చేయలేకపోయారన్న అనిత
- కానీ, కూటమి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటోందని వెల్లడి
- కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని ఆవేదన
- ఎలాంటి వాళ్లకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని జగన్ కు హితవు
వైఎస్ విజయమ్మ, షర్మిలపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఏపీ హోంమంత్రి అనిత విమర్శనాస్త్రాలు సంధించారు. ఆడవాళ్లను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని... కానీ సొంత తల్లిని, చెల్లిని తిట్టిన వాళ్లను మీరు ఏమీ చేయలేకపోయారంటూ ఎత్తిపొడిచారు.
మీ తల్లిని, మీ చెల్లిని తిట్టిన వాళ్లను ఇప్పుడు మేం అరెస్ట్ చేస్తున్నాం అని వెల్లడించారు. ఎలాంటి వారికి మీరు మద్దతు ఇస్తున్నారో ఓసారి ఆలోచించుకోవాలని అని జగన్ కు హితవు పలికారు.
సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి జడ్జిలను, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. ఆ సోషల్ మీడియా పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందని అన్నారు.
ఇటువంటి దుర్మార్గమైన పోస్టులు పెట్టేవారిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలని అనిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని వెల్లడించారు.