Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య మరో వివాదం... తీవ్ర ఆరోపణలు చేసిన పాక్ స్క్రాబుల్ ఆటగాళ్లు

some Pakistan players claimed they were not issued visa for Asia Cup Youth Scrabble Championship

  • భారత్ వీసాలు ఇవ్వలేదంటున్న పాక్ స్క్రాబుల్ ప్లేయర్లు
  • సగం మందికి పైగా ఆటగాళ్లకు వీసా తిరస్కరించారని మండిపాటు
  • కారణం చెప్పకుండానే తిరస్కరించారని ఆరోపణ

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా పాల్గొనడంపై భారత్-పాకిస్థాన్ మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. భద్రతా కారణాల రీత్యా ఆతిథ్య పాక్‌కు టీమిండియాను పంపించబోమని  బీసీసీఐ.. రావాల్సిందేనని పీసీబీ వాదులాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మరో వివాదం చెలరేగింది. 

భారత్‌ వేదికగా ఇవాళ్టితో (మంగళవారం) ముగిసిన ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, ఢిల్లీ కప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు ఇవ్వలేదని కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు ఆరోపించారు. రెండు నెలల ముందుగానే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ తాత్సారం చేశారని చెబుతున్నారు. అయితే పాక్ జట్టుకు 12 వీసాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు తిరస్కరించామంటూ వచ్చిన మీడియా కథనాలను చూశామని, నవంబర్ 7వ తేదీన 12 మంది పాక్ ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. సకాలంలోనే జారీ చేశామని అన్నారు. అయితే పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లందరికీ వీసాలు జారీ చేయలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. వీసా పొందిన ప్లేయర్లు కూడా చాలా ఆలస్యంగా ఆ వీసాలు అందుకున్నారని, దీంతో భారత్‌కు రాలేకపోయారని పేర్కొన్నారు.

కాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో భారత్‌కు వచ్చి టోర్నీలో పాల్గొని గెలిచిన ఆటగాళ్లతో పాటు జట్టులోని సగం మంది ఆటగాళ్లకు వివరణ లేకుండానే వీసాలు తిరస్కరించారని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News