Jason Gillespie: ఆస్ట్రేలియాపై వ‌న్డే సిరీస్ విజ‌యం... అయినా పాకిస్థాన్ కోచ్ అస‌హ‌నం... కార‌ణమిదే!

Pakistan Coach Jason Gillespie Said That Odi Series Was Not Promoted In Australia At All

  • పాకిస్థాన్‌తో వ‌న్డే సిరీస్ ను సీఏ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌లేద‌న్న‌ జాస‌న్ గిలెస్పీ
  • ఈ విష‌య‌మై క్రికెట్ ఆస్ట్రేలియా తీరు ప‌ట్ల గిలెస్పీ ఆగ్ర‌హం
  • బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ సిరీస్‌కు సీఏ అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని వ్యాఖ్య‌

ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను పాకిస్థాన్ కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల త‌ర్వాత కంగారూల‌ గ‌డ్డ‌పై పాక్ వ‌న్డే సిరీస్ గెలుచుకుంది. అయితే పాక్ జ‌ట్టు వైట్‌బాల్ కోచ్ జాస‌న్ గిలెస్పీ మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీరు ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 

దీనికి కార‌ణం పాకిస్థాన్‌తో వ‌న్డే సిరీస్ ను సీఏ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డ‌మే. ఈ విష‌య‌మై గిలెస్పీ క్రికెట్ ఆస్ట్రేలియా తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ మేర‌కు ఆసీస్‌కు చెందిన ఓ వార్త‌ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న సీఏ తీరును ఎండ‌గ‌ట్టాడు.

పాక్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల తాను సంతోషంగా ఉన్నా... సీఏ ఈ సిరీస్‌కి స‌రైన గుర్తింపు ఇవ్వ‌లేద‌న్నారు. ఆస్ట్రేలియా బోర్డు బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ సిరీస్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని ఆరోపించాడు. అందుకే త‌మ సిరీస్ కు ఎలాంటి ప్ర‌చారం జ‌ర‌గ‌లేద‌ని గిలెస్పీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

ఇక క్రికెట్ ప్ర‌మోష‌న్స్‌లో 'ఫాక్స్' స్పోర్ట్స్ చానల్ అద్భుత‌మైన పాత్ర పోషిస్తుంద‌ని కితాబిచ్చారు. కానీ సీఏ ప్రాధాన్య‌త మారింద‌ని ఆరోపించారు. ఫాక్స్ లో ఎక్కడా ఆసీస్-పాకిస్థాన్ వన్డే సిరీస్ కు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించలేదని విమర్శించారు. పాక్‌-ఆసీస్‌ సిరీస్‌కు అడ్వ‌ర్ట‌యిజింగ్‌, ప్ర‌చారం జరగలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

భార‌త్‌తో టెస్టు సిరీస్ కోసం కీల‌క ఆట‌గాళ్ల‌యిన మిచెల్ స్టార్క్‌, మార్క‌స్ ల‌బుషేన్, జోష్ హేజిల్‌వుడ్‌, స్టీవ్ స్మిత్‌తో పాటు సార‌థి ప్యాట్ క‌మ్మిన్స్ కు పెర్త్‌లో పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చార‌ని గిలెస్పీ చెప్పారు. కాగా, జాస‌న్ గిలెస్పీ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ పేస‌ర్ అనే విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News