Balagam venu: 'బలగం' వేణు 'యెల్లమ్మ' కథకు హీరో ఫిక్స్!

Balagam Venu Yellamma story hero fix

  • నితిన్‌ హీరోగా 'యెల్లమ్మ' చిత్రం 
  • అధికారికంగా ప్రకటించిన 'దిల్‌'రాజు 
  • వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ యాసను నేపథ్యంగా తీసుకుని, వాటికి బలమైన కుటుంబ భావోద్వేగాలను జత చేసి కమెడియన్‌ వేణు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. విశేషమైన జనాదరణతో ఈ చిత్రం తెలుగు సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ సినిమాగా నిలిచింది. అంతేకాదు ప్రతి  గ్రామంలో ఈ చిత్రం తెరలు కట్టుకుని మరీ చూశారంటే ఈ చిత్రం వాళ్ల హృదయాలను ఎంతలా హత్తుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్‌'రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా 'బలగం' తరువాత దర్శకుడు వేణు 'యెల్లమ్మ' అనే డివోషనల్‌ టచ్‌ వున్న ఓ కథతో రెడీ అయ్యాడు. మొదట్లో ఈ చిత్ర కథను హీరో నానికి వినిపించాడు. అయితే నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో, వేణు గత కొంతకాలంగా ఈ కథకు సూట్ అయ్యే మరో హీరో కోసం అన్వేషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ కథ, హీరో నితిన్‌కు నచ్చడంతో ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదే విషయాన్ని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత 'దిల్‌'రాజు కన్‌ఫర్మ్‌ చేశాడు. 'బలగం' వేణు-నితిన్‌ కాంబినేషన్‌లో 'యెల్లమ్మ' చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుందని దిల్‌ రాజు తెలియజేశారు. ప్రస్తుతం తమ సంస్థలో రామ్‌చరణ్‌తో 'గేమ్‌ ఛేంజర్‌', వెంకటేష్‌ -అనిల్‌ రావిపూడి కలయికలో 'సంక్రాంతికి వస్తున్నాం' నితిన్‌తో 'తమ్ముడు', విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా, ఆశిష్‌తో 'సెల్ఫీష్‌' సినిమాలు నిర్మిస్తున్నానని 'దిల్‌ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. 

More Telugu News