India Vs Pakistan: పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటనపై పీసీబీకి కీలక సమాచారం ఇచ్చిన ఐసీసీ
- పాక్‌లో పర్యటనకు భారత జట్టు ఇష్టపడడం లేదని పీసీబీకి సమాచారం ఇచ్చిన ఐసీసీ
- ఐసీసీ ఈ-మెయిల్‌ను పాక్ ప్రభుత్వానికి పంపామని వెల్లడి
- ఫిబ్రవరి-మార్చిలో పాక్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పంపబోమంటున్న బీసీసీఐ
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే భద్రతా కారణాల రీత్యా టీమిండియా పాకిస్థాన్ వెళ్లబోదని, భారత్ మ్యాచ్‌లన్నింటిని దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి అధికారిక స్పష్టత వచ్చింది. పాకిస్థాన్ రావడానికి భారత్ ఇష్టపడటం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తెలియజేసింది. ఈ విషయాన్ని పీసీబీ స్వయంగా ధ్రువీకరించింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జట్టు పాక్ వెళ్లబోదంటూ భారత్ తమకు సమాచారం ఇచ్చినట్టు ఐసీసీ తెలిపిందని పీసీబీ వెల్లడించింది. ఈ మేరకు ఈ-మెయిల్ వచ్చిందని పేర్కొంది. ఈ విషయంలో సలహా, సూచనలు తీసుకునేందుకు ఐసీసీ పంపిన మెయిల్‌ను ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేశామని పీసీబీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఐసీసీ మెయిల్‌పై పీసీబీ ప్రతినిధి అంతకుమించి స్పందించలేదు. అయితే ఐసీసీ నుంచి ఏదైనా లిఖితపూర్వక సమాచారం వచ్చినప్పుడు తమ విధానాన్ని వెల్లడిస్తామని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ మోడల్ పాకిస్థాన్‌కు ఆమోదయోగ్యం కాదని కూడా నఖ్వీ చెప్పారు.
కాగా భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లపై కూడా ప్రభావం చూపింది.