Andhra Pradesh: నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్టు.. తిరిగి పట్టాలెక్కిన ప్రతిపాదన!
- కొత్త డీపీఆర్లు సిద్ధం చేసి రెండు నెలల్లో టెండర్లు పిలిచే ఛాన్స్
- అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కూటమి సర్కారు
- 2019లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు
దాదాపు ఐదేళ్ల క్రితం 2019 జనవరిలో నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ సర్కారు ఏర్పాటు కావడంతో పనులు జరగలేదు. అయితే తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణంపై కదలిక వచ్చింది. విమానాశ్రయాన్ని దగదర్తిలోనే నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తిరిగి కదలిక వచ్చింది.
ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో ఉండడంతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అన్ని అనుమతులు దక్కడంతో నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం కదిలింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కొత్త డీపీఆర్లను సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొత్త ధరల ప్రకారం అంచనాలు వేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని సూచించింది. గుత్తేదారు సంస్థను ఎంపిక చేసిన వెంటనే పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెప్పారు.
జగన్ హయంలో ఏం జరిగిందంటే..
దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2019లో నాటి చంద్రబాబు ప్రభుత్వం టర్బో కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం అంచనా వ్యయం రూ.30 వేల కోట్లుగా ఉంది. దగదర్తి దగ్గర 1,352 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. దగదర్తిలో కాకుండా తెట్టు అనే ప్రాంతంలో నిర్మాణం చేపడతామంటూ కేంద్రానికి జగన్ సర్కారు ప్రతిపాదన పంపింది. అంతేకాదు టర్బో కన్సార్షియంతో కుదిరిన ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేటాయించిన 2వేల ఎకరాల్లో ఎక్కువగా అటవీ భూములు ఉండడంతో కేంద్రం అనుమతులు ఆలస్యమయ్యాయి. దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదన నిలిచిపోయింది.