DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్
- సీజేఐగా నేటితో ముగిసిన జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం
- 2022లో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్
- సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
- 51వ సీజేఐగా రేపు ప్రమాణ స్వీకారం
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నేటితో ముగిసింది. సీజేఐగా ఆయన ఇవాళ పదవీ విరమణ చేశారు.
డీవై చంద్రచూడ్ 2022 నవంబరు 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామ మందిర వివాదం, ఆర్టికల్ 370, బుల్డోజర్ చర్యలు, స్వలింగ సంపర్కుల వివాహం, ఎన్నికల బాండ్లు, ప్రైవేట్ ఆస్తి వివాదం వంటి అత్యంత కీలకమైన అంశాలపై తన పదవీకాలంలో తీర్పులు ఇచ్చారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2016లో నియమితులయ్యారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుపొందారు. చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ (వైవీ చంద్రచూడ్) గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక కాలం సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసింది వైవీ చంద్రచూడ్ ఒక్కరే. ఆయన వారసుడిగా న్యాయ వ్యవస్థలోకి అడుగుపెట్టిన డీవై చంద్రచూడ్, అంచెలంచెలుగా ఎదిగారు. సీజేఐ పదవికి డీవై చంద్రచూడ్ వన్నె తెచ్చారు.
ఇక, డీవై చంద్రచూడ్ నేడు పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (నవంబరు 11) ఉదయం 10 గంటలకు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.