Amaravati: అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt issues orders to usage of Rs 15 thousand crores funds towards Amaravati

  • ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్ల సాయం
  • ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా సర్దుబాటు
  • సీఆర్డీయే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
  • మరో రూ.6,750 కోట్ల మేర నిధులు వచ్చే అవకాశం

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించడం తెలిసిందే. ఈ నిధులను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా అందించేలా సర్దుబాటు చేసింది. ఈ నేపథ్యంలో, ఈ రూ.15 వేల కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 

అమరావతి అభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేయాలని, ముఖ్యంగా, రోడ్లు, జలవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ నిధులతో చేపట్టాలంటూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో సీఆర్డీయేకి దిశానిర్దేశం చేసింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, పర్యావరణ హిత నిర్మాణాలు, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. 

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు అందుకునేందుకు సీఆర్డీయే కమిషనర్ కు అధికారాలు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాము పేరిట  ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

కాగా, అమరావతి అభివృద్ధికి సీఆర్డీయే పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. ఇక, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపితే... అమరావతి నిర్మాణానికి మరో రూ.6,750 కోట్ల మేర నిధులు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News