Ministry Of Sex: రష్యాలో శృంగార మంత్రిత్వశాఖ.. ఏర్పాటు వెనక కారణం ఇదే!
- జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రష్యా
- జనన, మరణాల రేటుకు మధ్య భారీ వ్యత్యాసం
- జంటల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు పలు ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం
రష్యా ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జననాలకు, మరణాలకు మధ్య భారీ వ్యత్యాసం కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోయింది. దీనికి తోడు ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రాణనష్టం భారీగా సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో జననాల రేటు పెంచేందుకు సెక్స్ మినిస్ట్రీ (శృంగార మంత్రిత్వశాఖ)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
దేశంలో జననాల రేటు ఎలా పెంచాలన్న దానిపై పలు ఆలోచనలు చేస్తోంది. రాత్రివేళ కరెంటు తీసేయడం, ఇంటర్నెట్‌ను ఆఫ్ చేయడం వంటి వాటిని పరిశీలిస్తోంది. ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసి, కరెంటు తీసేయడం వల్ల జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, అది పిల్లల పుట్టుకకు దోహదం చేస్తుందని భావిస్తోంది. అలాగే, ఇళ్లలో ఉండే తల్లులకు వేతనం ఇవ్వడం, హోటళ్లలో బస చేసే జంటల ఖర్చును భరించడం, డేటింగ్‌ను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా జననాల రేటు పెంచాలన్న ఆలోచనకు వచ్చింది.
రష్యాలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో 5,99,600 మంది చిన్నారులు జన్మించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 16 వేల జననాలు తక్కువగా నమోదయ్యాయి. 1999 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతేకాదు, జనాభా సహజ క్షీణత కూడా ఈసారి భారీగా పెరిగింది. జనవరి, జూన్ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 49 వేల మరణాలు ఎక్కువగా రికార్డయ్యాయి.