Heavy Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు
- నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- రేపు ఉదయానికి అల్పపీడనంగా మారే అవకాశం
- 11 నుంచి మూడు రోజులపాటు వర్షాలు
- మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమకు మరోమారు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనించి తమిళనాడు, శ్రీలంక తీరంపైపు వెళ్తుందని వాతావరణశాఖ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.