Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన బండి సంజయ్

Bandi Sanjay fires at KCR and Revanth Reddy

  • మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం
  • తాము మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెడతామని హెచ్చరిక
  • ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ బయటకు రాలేదని విమర్శ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి ఆయన 'జితేందర్ రెడ్డి' సినిమాను చూశారు. సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు అన్నారు. అందుకే మోసాలు, అబద్ధాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు.

ఆరు గ్యారెంటీలపై మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం కాదని... తెలంగాణలో ఉండి చెప్పాలని సవాల్ చేశారు. నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారని, అందులో వీటిని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం చెప్పారని... కానీ 20 లక్షల మంది రైతులకు మాఫీ కాలేదన్నారు. ఇతర హామీలు కూడా అమలు చేయలేదన్నారు.

హామీలు నెరవేర్చకుండానే మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మేమూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బండారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంపై పదకొండు నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారని తెలిసే హర్యానాలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై యుద్ధం చేస్తామని సీఎం అంటున్నారని... ఎందుకు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? రోడ్లకు నిధులు ఇస్తున్నందుకా? స్మార్ట్ సిటీలు తయారు చేస్తున్నందుకా? గ్రామాలను అభివృద్ధి చేస్తున్నందుకా? ఎందుకు యుద్ధం చేస్తారో చెప్పాలన్నారు.

రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై కేసీఆర్ ప్రభుత్వం రూ.1 లక్ష అప్పు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడో మరిచిపోయారన్నారు. అందుకే ఆయన ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వంటి వారిని తెలంగాణ సమాజం లీడర్‌గా భావించదన్నారు. రాష్ట్రంలో సమస్యలు వచ్చినప్పుడు బయటకు రాని కేసీఆర్... కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తానని అంటున్నాడని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News