Sabitha Indra Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఒకరి చావును కోరుకోవడం ఎంత వరకు సమంజసం?: సబితా ఇంద్రారెడ్డి
- సీఎం మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శ
- తెలంగాణ ప్రదాత కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య
- సభ్య సమాజానికి సీఎం ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరి చావును కోరుకోవడం ఎంత వరకు సమంజసమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నిన్న మూసీ పునరుద్ధరణ యాత్ర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు శోచనీయమన్నారు. సభ్య సమాజానికి సీఎం ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తన పుట్టినరోజు నాడు కూడా సీఎం... కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయాడని విమర్శించారు. దీనిని బట్టే కేసీఆర్ అంటే ఎంత భయమో తెలుస్తోందన్నారు.
రేపు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నచింతకుంట మండలంలో అమ్మాపూర్ కురుమూర్తిస్వామి వారిని దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయం సమీపంలో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.