Rohit Sharma: భారత్-ఆసీస్ తొలి టెస్టులో రోహిత్ ఆడతాడా లేదా?... కీలక అప్‌డేట్ ఇదే!
- రేపు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరనున్న కెప్టెన్
- జట్టుతోనే ఉన్నా ఫస్ట్ మ్యాచ్ ఆడడంపై ఇంకా రాని క్లారిటీ
- భార్య డెలివరీ కోసం ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే అవకాశం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 22 నుంచి జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చంటూ కొన్ని రోజులుగా జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై కొంత క్లారిటీ వచ్చింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమవ్వాలని రోహిత్ తొలుత భావించినప్పటికీ... తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ 10న (ఆదివారం) ఆస్ట్రేలియా బయలుదేరనున్న భారత జట్టు తొలి బ్యాచ్ ఆటగాళ్లలో కెప్టెన్ కూడా ఉంటాడని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది. ‘‘రోహిత్ ఆదివారం కొందరు ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. మిగిలిన ఆటగాళ్లు మరో బ్యాచ్‌గా సోమవారం బయలుదేరుతారు. ఆటగాళ్లందరినీ ఒకే కమర్షియల్ విమానంలో పంపించడం బీసీసీఐకి కుదరలేదు. అందుకే రెండు బ్యాచ్‌లుగా ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళుతున్నారు’’ అని పేర్కొంది.
అయితే తొలి మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ జట్టుతోనే ఉంటాడని తెలుస్తున్నా.. మ్యాచ్‌లో ఆడడం నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత కారణంతో రోహిత్ ఇంటికి వెళ్లి తిరిగి రావచ్చని కథనం పేర్కొంది. కాగా పెర్త్ వేదికగా నవంబర్ 22న భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
కాగా రోహిత్ శర్మ భార్య రితికా ప్రస్తుతం నిండు గర్భిణి. రెండవ బిడ్డకు ఆమె జన్మనివ్వబోతున్నారు. డెలివరీ సమయంలో దగ్గర ఉండాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు. ఈ విషయంపై బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు.
అయితే కీలకమైన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ కచ్చితంగా ఆడాలని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో అందుబాటులో లేకుండా పోయేట్టయితే... వైస్ కెప్టెన్ బుమ్రాను సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా ప్రకటించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లబోతున్నట్టు క్లారిటీ వచ్చింది.