Harish Rao: కేటీఆర్‌పై కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao says conspiracy to put case against KTR

  • ప్రజాబలంతోనే తాము కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్య
  • మూసీ కాలుష్యం పాపం కాంగ్రెస్‌దే అని విమర్శ
  • సీఎం రేవంత్ రెడ్డి చేసింది పాదయాత్ర కాదు... పాపయాత్ర అని మండిపాటు

ప్రజాసమస్యల గురించి ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై కేసులు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజాబలంతోనే తాము కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతామన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ... సమస్యలను గాలికి వదిలేసి... సీఎం, మంత్రులు గాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. మూసీ కాలుష్యం పాపం కాంగ్రెస్‌దే అన్నారు. మూసీ నది వద్ద సీఎం చేసింది పాదయాత్ర కాదని.. పాపయాత్ర అని ఎద్దేవా చేశారు.

మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్దమే అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. యాదాద్రిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

"రేవంత్ రెడ్డీ... నీ అన్యాయాలను, మోసాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై అక్రమ కేసుతో కుట్ర చేయడమంటే అది తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడమే" అని నిప్పులు చెరిగారు.

సీఎం, మంత్రులు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడాన్ని హరీశ్ రావు తప్పుబట్టారు. రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలి పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి వెళుతున్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. మంత్రి సీతక్క సొంత జిల్లాలో పత్తికి మద్దతు ధర లభించడం లేదన్నారు. ఆహారం కల్తీ విషయంలో ముఖ్యమంత్రికి పట్టింపే లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చెప్పిన మార్పు ఇదేనా? అని నిలదీశారు.

Harish Rao
KTR
Congress
Telangana
  • Loading...

More Telugu News