Gautham Gambhir: గంభీర్‌కు బీసీసీఐ లాస్ట్ ఛాన్స్... ఫలితం లేకుంటే వేటు?
- ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో జట్టు విఫలమైతే టెస్ట్ ఫార్మాట్ కోచింగ్ బాధ్యతల నుంచి తొలగింపు!
- ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో బీసీసీఐ యోచన
- టీ20, వన్డే ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయం
- టెస్ట్ ఫార్మాట్ కోచ్ బాధ్యతలు వీవీఎస్ లక్ష్మణ్ వంటి స్పెషలిస్టులకు అప్పగించే అవకాశం
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వస్తే జట్టు విజయాల బాట పడుతుందని భారత క్రికెట్ అభిమానులు ఆశించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కోచ్‌గా గంభీర్ రావడంతో అప్పట్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఆశించిన రీతిలో ఆరంభం దక్కలేదు. గంభీర్ పర్యవేక్షణలోని భారత జట్టు ఆడిన వన్డే సిరీస్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది.
తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో 0-3 తేడాతో ఓడిపోయింది. దీంతో కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి మొదలుకానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గంభీర్‌కు చావో రేవో లాంటి అసలైన ‘టెస్ట్’ అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో గంభీర్‌ను కొనసాగించడానికి ఈ సిరీస్ అతిపెద్ద పరీక్ష కాబోతోందని సమాచారం.
ఆస్ట్రేలియాలో జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు విఫలమైతే టెస్టు ఫార్మాట్ కోచ్ బాధ్యతల నుంచి గంభీర్‌ను తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు ‘దైనిక్ జాగరణ్’ కథనం పేర్కొంది. అయితే టీ20, వన్డే ఫార్మాట్ల కోచ్‌గా కొనసాగించనున్నారని తెలిపింది. కాగా టెస్ట్ ఫార్మాట్ కోచ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ వంటి స్పెషలిస్టులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
అయితే ఈ నిర్ణయానికి గంభీర్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. గంభీర్ నిర్ణయం ఎలా ఉన్నా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జట్టు విఫలమైతే కఠిన నిర్ణయం తప్పకపోవచ్చనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
కివీస్ చేతిలో వైట్‌వాష్‌కు గురికావడంతో నిన్న (శుక్రవారం) బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. దాదాపు 6 గంటలపాటు కొనసాగిన ఈ సుదీర్ఘ సమీక్షలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, భారత వన్డే, టెస్టు ఫార్మాట్ల కెప్టెన్ రోహిత్ శర్మతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో చేతిలో 0-3 తేడాతో ఓటమికి గల కారణాలపై చర్చించారు. జట్టు ఎంపిక విషయంలో గంభీర్, జట్టులోని అనుభవజ్ఞుల మధ్య విభేదాలు ఉన్నట్టు బయటపడింది.